Dr.AVS.Raju
(founder of NCC ltd.)
'చదువులేనివాళ్లు ఏమీ సాధించలేరు’ అని ఎవరైనా చెబితే, అది ఒట్టి అబద్ధం. పదో తరగతి పాసవ్వకపోయినా, దేశంలోని అత్యున్నత నిర్మాణ రంగ సంస్థల్లో ఒకదాన్ని స్థాపించిన నా జీవితమే అందుకు సాక్ష్యం. ‘వ్యాపారులకు పని తప్ప మరో ప్రపంచం తెలీదు’ అనే అభిప్రాయమూ తప్పే. ఎందుకంటే... ఓ పక్క కోట్ల విలువైన కాంట్రాక్టు పనులు చేస్తూనే ఇరవై ఏడువేల పైచిలుకు పద్యాలూ, కొన్ని పుస్తకాలనూ నేను రాశాను. మధ్య తరగతి కుటుంబంలో పుట్టా. సున్నా నుంచి జీవితాన్ని మొదలుపెట్టా. అంచెలంచెలుగా అడుగులేస్తూ వేల కోట్ల ఆస్తుల్నీ, అంతకంటే విలువైన మనుషుల్నీ సంపాదించుకోగలిగా. ఈ సుదీర్ఘ ప్రయాణం తూర్పు గోదావరి జిల్లా, అంతర్వేదిపాలెంలో మొదలైంది. మా నాన్న నారాయణ రాజు వ్యవసాయంతో పాటు కాంట్రాక్టు పనులూ చేసేవారు. జేబులో వంద రూపాయలుంటే ఎనభై పక్కవాళ్ల కోసం ఖర్చుపెట్టే మనస్తత్వం ఆయనది. తెలిసిన వాళ్లకు కష్టమొస్తే అప్పుచేసైనా ఆదుకునేవారు. ఇతరులకు చేసిన సాయం పదింతలై తిరిగొస్తుందని చెప్పేవారాయన.
రెండేళ్లు నాన్నతోనే
చిన్నప్పుడోసారి అమ్మ ఓ అరబస్తా బియ్యం నా ముందుపోసి రాళ్లు ఏరమని చెప్పింది. ఒకట్రెండు గంటల్లో ఆ పని పూర్తి చేసి ఇంకొన్ని బియ్యం ఇవ్వమని అడిగా. పెద్దవాళ్లకే ఐదారు గంటలు పట్టే ఆ పనిని నేనంత తొందరగా చేయడం చూసి అమ్మ ఆశ్చర్యపడింది. నా ఏకాగ్రతను మెచ్చుకుంది. ఓ రోజు నాన్న పెరట్లో మొక్కలకు నీళ్లు పోసి రమ్మంటే, ఆ పనితో పాటు చుట్టూ ఉన్న కలుపూ, ఎండుటాకులూ, చెత్తను శుభ్రం చేశా. వాలిపోయిన కొమ్మలను తాళ్లతో కట్టా. మొక్కలపైన ఎక్కువ ఎండ పడకుండా గోనె సంచీలతో పరదా ఏర్పాటు చేశా. మొత్తం ఎన్ని కూరగాయలు కాశాయో కూడా లెక్కపెట్టి నాన్నకు చెప్పా. ఆయన నా చొరవనీ అంకితభావాన్నీ చూసి ముచ్చటపడ్డారు. ఆ రెండు సంఘటనలతో ఎలాంటి పని చెప్పినా శ్రద్ధగా చేస్తానన్న విషయం అమ్మానాన్నలకూ, ఎంత చిన్న పనైనా ఆస్వాదిస్తూ చేయగలనన్న సంగతి నాకూ అర్థమైంది. నేను తొమ్మిదో తరగతిలో ఉండగా నాన్న తీవ్ర అనారోగ్యంతో మంచాన పడ్డారు. అమ్మ పిల్లల్నీ, ఇంటి పనుల్నీ చూసుకుంటూ రోజంతా నాన్నకు సేవ చేయడం కష్టం. దాంతో ఆ బాధ్యతను నేను భుజాన వేసుకున్నా. అక్కడితో చదువుకు విరామమిచ్చి నాన్నతోనే ఉన్నా. స్నానం చేయించడం, అన్నం తినిపించడం, కబుర్లు చెప్పడం, పొలానికి తీసుకెళ్లడం... ఇలా రెండేళ్ల పాటు ఆయన సేవలోనే రోజులు
గడిచిపోయాయి.
గడిచిపోయాయి.
పదితో ఆపేశా
నాన్నతో గడిపిన ఆ రెండేళ్లూ నాకు జీవితానికి సరిపడా పాఠాలు నేర్పాయి. వ్యవసాయ, కాంట్రాక్టు పనుల మెలకువల నుంచి పోటీ ప్రపంచంలో బతకడానికి కావాల్సిన నైపుణ్యాల వరకూ అనేక విషయాలు బోధించారు. చివరికి అనారోగ్యంతో పోరాడుతూ ఓ రోజు కన్నుమూశారు. కొండంత భరోసా ఉన్న ఫళంగా దూరమవడంతో ఏం చేయాలో తెలీలేదు. చదువుని కొనసాగించాలన్న ఆసక్తీ తగ్గిపోయింది. ఆస్తిపంపకాల్లో నా వాటాగా పదిహేనెకరాల పొలం చేతికొచ్చింది. తెలివితేటలూ, సమయ పాలన, విచక్షణాజ్ఞానం ఉంటే ఏవైనా కారణాలతో చదువుకి దూరమైనా జీవితంలో ఎదగొచ్చన్నది నా నమ్మకం. అందుకే డిగ్రీ పట్టాల సంగతి పక్కన పెట్టి వ్యవసాయం చేస్తూ బియ్యం వ్యాపారాన్నీ మొదలుపెట్టా. కానీ వ్యాపారం ఆశించిన స్థాయిలో నడవకపోవడంతో మూసేయాల్సి వచ్చింది. మరో ఆదాయ మార్గం కోసం అన్వేషిస్తుంటే కాంట్రాక్టర్‌గా నాన్న సాధించిన గౌరవ మర్యాదలు గుర్తొచ్చాయి. ఆయన్నే అనుసరిస్తూ చిన్న వయసులోనే ధైర్యం చేసి కాంట్రాక్టర్‌గా పేరు నమోదు చేసుకొని రంగంలోకి దిగా. వ్యవసాయం చేసుకుంటూనే, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో వ్యవసాయ కాంట్రాక్టులూ అందిపుచ్చుకుంటూ ముందుకెళ్లా.
సవాళ్లను దాటకుంటూ
నాలా మరమ్మతులూ, పైపులైన్లూ, డ్యామ్ లాకుల ఏర్పాట్లూ లాంటి చిన్నచిన్న పనులతో కాంట్రాక్టర్‌గా కొంత పేరూ, అనుభవం సాధించా. పాతికేళ్ల వయసులో పరిధిని పెంచుకోవాలని కాస్త పెద్ద కాంట్రాక్టులకు టెండర్లు వేయడం మొదలుపెట్టా. అలా మచిలీపట్నంలో సముద్ర తీరానికి దగ్గరలో ఓ వ్యవసాయ కాలువని పునరుద్ధరించే పనిని సంపాదించా. తొంభై శాతం ప్రాజెక్టు పూర్తయ్యాక అలల వేగం పెరిగి పనులు జరుగుతున్న ప్రాంతం వరకూ వచ్చి ఇసుక, సిమెంటు, కంకరను తుడిచిపెట్టడం మొదలుపెట్టాయి. దాంతో కొన్ని బస్తాల నిండా ఇసుక నింపి కాలువ చుట్టూ వాటిని గోడలా ఏర్పాటు చేసి అలల్ని నిలువరించమని చెప్పా. ఎక్కువసేపు ఆపడం సాధ్యం కాదు కాబట్టి పగలూ రాత్రి కష్టపడి వాయువేగంతో పనిని పూర్తి చేశాం. ఆ ప్రాజెక్టుకు పది కిలోమీటర్ల దూరంలోనే మరో పనీ చేసేవాళ్లం. రోజుకు రెండుసార్లు ఇటూ అటూ... అంటే నలభై కిలోమీటర్లు నడిచి వెళ్లి పనులను చూసుకునేవాణ్ణి. అలాంటి క్లిష్టమైన కాంట్రాక్టులన్నీ నాకు మంచి పేరుని తీసుకొచ్చాయి. ఆ సమయంలోనే రాజధాని వెళ్లి నా
పరిధిని విస్తరించుకోవాలన్న ఆలోచనలూ మొదలయ్యాయి.
పరిధిని విస్తరించుకోవాలన్న ఆలోచనలూ మొదలయ్యాయి.
భాగ్యనగరంలో అడుగు
1975 ప్రాంతంలో కొత్త ఆశలూ, ఆలోచనలతో హైదరాబాద్‌లో అడుగుపెట్టా. పదహారవ ఏటనే నాకు పెళ్లయింది. పది మంది సంతానం. అందరం కలిసి రెండు గదుల ఇంట్లో అద్దెకుండేవాళ్లం. కాంట్రాక్టర్‌గా అనుభవం ఉన్నా, నా బలం, మూలం వ్యవసాయమే. అందుకే రాజధానిలోనూ మొదట వ్యవసాయ పనులకే శ్రీకారం చుట్టా. మియాపూర్ ప్రాంతంలో ద్రాక్ష సాగు ప్రారంభించా. నాకున్న అనుభవం, కొందరు నిపుణుల సాయంతో వరసగా రికార్డు స్థాయిలో దిగుబడి సాధించా. ఆపైన నష్టాల్లో ఉన్న ఓ చేపల చెరువును దక్కించుకొని దాన్ని అభివృద్ధి చేశా. క్రమంగా వ్యవసాయం, కాంట్రాక్టుల సరిహద్దులను దాటి పరిశ్రమలను ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది. దాంతో కొంతమంది మిత్రుల సాయంతో ప్రఖ్యాత ఇంజినీర్ కేవీకే రాజుగారి మార్గదర్శకత్వంలో ‘నాగార్జున స్టీల్స్ లిమిటెడ్’ పేరుతో తొలి పరిశ్రమను నెలకొల్పా. ఆ సమయంలోనే భూమిని నమ్ముకుంటే భవిష్యత్తు బంగారమే అనిపించి ‘నాగార్జున కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’ని పెట్టి పంజగుట్టలో పదిహేను ఎకరాల స్థలాన్ని కొని అన్ని వసతులతో కాలనీని అభివృద్ధి చేశా. అదే ప్రస్తుతం ఆ ప్రాంతానికి ముఖచిత్రంలా మారిన నాగార్జున హిల్స్. అప్పటిదాకా సాధించిన అనుభవంతో రిస్కుకి సిద్ధపడి భవిష్యత్తుపైన కోటి ఆశలతో 1978లో నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ(ప్రస్తుతం ఎన్సీసీ లిమిటెడ్)కి పునాది వేశా.
ఆ ప్రాజెక్టు రికార్డుల్లోకి...
నాణ్యతలో రాజీ లేకుండా చెప్పిన సమయానికి ప్రాజెక్టులు పూర్తి చేయగలిగితే గుర్తింపు అదే వస్తుంది. ఆ సూత్రంతోనే ఎన్సీసీ పరిధిలో చిన్న స్థాయి నిర్మాణాల నుంచి భారీ ప్రాజెక్టుల వరకూ టెండర్ల ద్వారా ఒక్కోదాన్ని చేజిక్కించుకుంటూ ముందుకెళ్లా. ఎన్సీసీ మొదలైన కొన్నాళ్లకు ‘ఏవీఎస్ కంటైనర్స్’ పేరుతో గ్యాస్ సిలిండర్లు తయారుచేసే కంపెనీ మొదలుపెట్టా. ఆపైన కర్నూలులో భారీ సిమెంట్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించా. నివాస, కార్యాలయ భవన సముదాయాలూ, క్రీడా ప్రాంగణాలు, సబ్‌వేలూ, ఫ్లైఓవర్లూ, వ్యవసాయ, హైడ్రో, పవర్, రైల్వే, రహదారి ప్రాజెక్టులూ... ఇలా క్రమంగా ప్రాజెక్టులను చేజిక్కించుకుంటూ, సకాలంలో పూర్తి చేస్తూ అంచలంచెలుగా ఎదిగా. హైదరాబాద్‌కు మణిహారంలా మారిన నెక్లెస్ రోడ్డును మేమే నిర్మించాం. దాన్ని మొదలుపెట్టినప్పుడు, రోడ్డు నిలబడదనీ వేసిన వెంటనే కుంగిపోతుందనీ చాలామంది భయపెట్టారు. కానీ సవాలుగా తీసుకొని దాన్ని పూర్తిచేసి అందరి అభిప్రాయం తప్పని నిరూపించాం. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో 126 గ్రామాలకు మంచినీటి సరఫరా కోసం 88 కిలోమీటర్ల మేర కేవలం గురుత్వాకర్షణ శక్తితో పనిచేసే పైపులైన్ నిర్మించాం. దానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ చోటు దక్కింది. 1995 నాటికే సంస్థ టర్నోవర్ వంద కోట్లు దాటింది. ఐదేళ్లకు రూ.400 కోట్లు, మరో ఐదేళ్లకు ఐదు వేల కోట్లు... ఇలా ప్రస్తుతం ఏటా వేలకోట్లు విలువ చేసే పనులతో, దేశంలోనే అగ్రగామి సంస్థగా ఎన్సీసీ దూసుకెళ్తొంది.
అరవై ఏళ్ల పైబడ్డ వ్యాపార జీవితంలో ఒక్క నిమిషం కూడా నేను ఏ సమావేశానికీ ఆలస్యంగా వెళ్లలేదు. ఉదయం ఏడింటికి ఇంట్లో నుంచి బయల్దేరాలంటే భూకంపం వచ్చినా ఆ సమయానికి గడప దాటాల్సిందే. అలా నా కచ్చితత్వం వల్ల ఉడికీ ఉడకని అన్నం తిని ఇంట్లో నుంచి బయటపడ్డ రోజులు లెక్కలేనన్ని ఉన్నాయి. చాలా ఏళ్ల క్రితం... మా పెద్దబ్బాయి పదో తరగతి చివరి పరీక్ష జరగాల్సిన రోజది. అదే రోజు ఉదయం పదింటికల్లా మరో వూళ్లొ మిత్రుడికి అత్యవసరమైతే పది వేలు తెచ్చిస్తానని మాటిచ్చా. ఇంట్లో నుంచి బయల్దేరే సమయానికి అధికారులు నేను చేస్తోన్న ఓ ప్రాజెక్టు తనిఖీకి వస్తున్నారన్న కబురందింది. నేను కచ్చితంగా వెళ్లాల్సిన పరిస్థితి. డబ్బులూ అనుకున్న సమయానికి స్నేహితుడికి ఇచ్చి తీరాల్సిందే. అంత పెద్ద మొత్తాన్ని వేరేవాళ్లకు ఇచ్చి పంపించలేను. నా పరిస్థితిని గమనించిన మా పెద్దబ్బాయి ‘పరీక్ష మళ్లీ రాసుకోవచ్చు, ఇచ్చిన మాటా, చెప్పిన సమయం మీరితే వెనక్కి తెచ్చుకోలేం’ అంటూ ఆ డబ్బు తీసుకొని బయల్దేరాడు. మావాడి పరీక్ష పోయింది. కానీ మాట నిలబడింది. ఆ తరవాత మావాడు నా అడుగుజాడల్లోనే వ్యాపారంలో ప్రవేశించాడు. అతడే ప్రస్తుతం ఎన్సీసీ లిమిటెడ్ ఎండీ రంగరాజు.
కోట్ల సంపదో, వ్యాపారాలో, పేరు ప్రతిష్ఠలో కాదు సమయపాలనా, కచ్చితత్వం, ధైర్యాన్నే నా వారసులకు ఆస్తిగా ఇచ్చా. వాటిని అందిపుచ్చుకుంటే వాళ్లే కాదు, ప్రపంచంలో ఎవరైనా ఏదైనా సాధించొచ్చు. ఎన్ని అద్భుతాలైనా సృష్టించొచ్చు..!

తొమ్మిదిసార్లు లిమ్కాబుక్‌లోకి...
సత్యసాయి బాబా ఆరాధకుడూ, సన్నిహితుడూ అయిన రాజు ‘శ్రీ సాయి సుధా మాధురి’ పేరుతో ఆయన జీవిత ప్రస్థానాన్ని వివరిస్తూ 25 వేలకు పైగా పద్యాలు రాసి తొమ్మిది సార్లు లిమ్కా బుక్‌తో పాటు గిన్నిస్ బుక్‌లోనూ చోటు దక్కించుకున్నారు.
* దిల్లీ ఎయిర్ పోర్టు, దిల్లీ మెట్రో రైలు, హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్, గచ్చిబౌలి స్టేడియం, సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం, శిల్ప కళా వేదిక, ఆర్బీఐ ప్రెస్, హైదరాబాద్‌కు కృష్ణా జలాలను తీసుకొచ్చే పైప్‌లైన్లూ, బీడీఎల్, సింగిరేణి కాలరీస్, సింగపూర్ టౌన్ షిప్లూ, చెన్నై, బెంగళూరుల్లో గేమ్స్ విలేజ్లూ, హైవేలూ... ఇలా దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో పేరున్న ప్రాజెక్టులను ఎన్సీసీ పూర్తిచేసింది.
* ఏవీఎస్ రాజు, సత్యనారాయణమ్మ దంపతులకు ఏడుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. అబ్బాయిలు ఏడుగురూ సంస్థలోని వివిధ విభాగాలకు నాయకత్వం వహిస్తున్నారు.
* పద్మశ్రీతో పాటు వివిధ సంస్థల నుంచి ఆరుసార్లు జీవిత సాఫల్య పురస్కారాలను అందుకున్నారు. ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఏవీఎస్ రాజు కుటుంబాన్ని ప్రత్యేకంగా రాష్ట్రపతి భవన్‌కి పిలిపించి ఆతిథ్యం అందించడంతో పాటు ఆయన రాసిన సత్యసాయి పద్యాల సంపుటికి అక్కడి అధికారిక గ్రంథాలయంలో స్థానం కల్పించారు. భారత నిర్మాణ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఇటీవలే వెంకయ్య నాయుడు, కేసీఆర్‌ల చేతుల మీదుగా ‘బులంద్ భారత్’ పురస్కారాన్నీ అందుకున్నారు.
* బెంగళూరులో సేవా దృక్పథంతో నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి కేజీ నుంచి పీజీ వరకూ విద్యను అందిస్తున్నారు. హైదరాబాద్ శివార్లలో శిరీష మెమోరియల్ ట్రస్టు పేరుతో అనాథాశ్రమాన్ని నిర్వహిస్తూ పిల్లల చదువు నుంచి ఆటపాటల వరకూ ఆలనాపాలనంతా చూసుకుంటున్నారు.